Baap: ఒకే సినిమాలో నలుగురు సీనియర్ స్టార్స్!
on Nov 9, 2022
ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి మేకర్స్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నందున బాలీవుడ్‌లో కొన్ని ఆసక్తికరమైన ప్రజెక్టులు రూపొందుతున్నాయి. అలాంటి ప్రాజెక్ట్‌లలో ఒకటి.. రాబోయే చిత్రం 'బాప్'. యాక్షన్ కామెడీ చిత్రంగా తయారవుతున్న ఈ మూవీకి వివేక్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతను ఇదివరకు ఆలియ భట్, రణదీప్ హూడా ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ డ్రామా 'హైవే' (2014)కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
ఈ చిత్రానికి కథను నికేత్ పాండే మరియు జోజో ఖాన్‌లతో కలిసి 'ఓం: ది బ్యాటిల్ వితిన్' ఫేం రచయిత రాజ్ సులూజా రాశారు. ఈ సినిమాని జీ స్టూడియోస్‌తో కలిసి అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అత్యంత ఆసక్తికర అంశం.. నలుగురు సీనియర్ స్టార్స్ కలిసి నటిస్తుండటం.. వారు.. మిథున్ చక్రవర్తి, సన్నీ డియోల్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్.
ఆ నలుగురు ఉన్న ఫోటోను ఫస్ట్ లుక్‌గా విడుదల చేసిన జీ స్టూడియోస్, ఆ లుక్ పోస్టర్‌కు "#BaapOfAllFilms Shoot dhamaal, dosti bemisaal" అనే క్యాప్షన్ పెట్టింది. 2022 జూన్‌లో, షూటింగ్‌లో మొదటి రోజు మిథున్, సంజయ్‌లతో కలిసి ఉన్న పిక్చర్‌ను జాకీ ష్రాఫ్ షేర్ చేశారు. ఆ తర్వాత స్టార్‌క్యాస్ట్‌లో సన్నీ డియోల్ కూడా చేరాడు. 'బాప్'కు సంబంధించి ఆయన ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే తొలిసారిగా దర్శనమిచ్చాడు.
జూన్ 16న మిథున్ చక్రవర్తి 72వ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని నిర్మాత అహ్మద్ ఖాన్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, 2023 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
